




*సాంకేతిక విద్యతో ఎక్కువ ఉపాధి అవకాశాలు -మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్*
విద్యార్థులు రెగ్యులర్ విద్యతో కాకుండా, సాంకేతిక విద్యను అభ్యసించడం ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలను పొందవచ్చు అని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక సి క్యాంప్ సెంటర్ నందు ఉన్న టీజీవి కళాక్షేత్రంలో విద్యా అకాడమీ నాలుగవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రెగ్యులర్ విద్యా విధానంలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందన్నారు. సాంకేతిక విద్యా రంగంలో నైపుణ్యత మెరుగుపరుచుకుంటే ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని తెలిపారు. పదవ తరగతి తర్వాత ప్రతి ఒక్కరు ఇంటర్ తద్వారా ఇంజనీరింగ్ మెడిసిన్ వైపు ఆలోచిస్తారని అది అందరికీ సాధ్యమయ్యే పని కాదన్నారు. ఎవరికివారు తమ తమ సామర్థ్యాన్ని బట్టి పాలిటెక్నిక్, నర్సింగ్, ఐటిఐ వంటి సాంకేతిక రంగాలను ఎంచుకుంటే చదివిన తర్వాత నిరుద్యోగిగా ఉండవలసిన అవసరం ఉండదు అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. చెడు అలవాట్లకు బానిసలు కాకుండా, క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని టీజీ తెలిపారు. విద్యార్థిని విద్యార్థులందరూ ప్రస్తుతం ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో రాణించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, విద్య అకాడమీ డైరెక్టర్ లు కొనేటి వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరమ్మ, టీజీవి కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, రిటైర్డ్ ఆర్టీవో కోనేటి చంద్రబాబు, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ కొట్టే చిన్నయ్య, రిటైర్డ్ ఏఎస్పి రామ్ నాథ్, చింతలపల్లి రామకృష్ణ, ఇనయతుల్లా తదితరులు పాల్గొన్నారు.